Logo

Aliyah 5 - Genesis 26:30 - 27:27

26:30
అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి.
26:31
తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.
26:32
ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక
26:33
దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.
26:34
ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసికొనెను.
26:35
వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.
27:1
ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను.
27:2
అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు.
27:3
కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము.
27:4
నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.
27:5
ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను.
27:6
అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో
27:7
మృతి బొందకమునుపు నేను తిని హషేం సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధ పరచుమని చెప్పగా వింటిని.
27:8
కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము.
27:9
నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను.
27:10
నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసికొనిపోవలెననెను.
27:11
అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా.
27:12
ఒకవేళ నా తండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను.
27:13
అయినను అతని తల్లి నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. నీవు నా మాట మాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా
27:14
అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను.
27:15
మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక
27:16
రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి
27:17
తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా
27:18
అతడు తన తండ్రి యొద్దకు వచ్చి - నా తండ్రీ, అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను
27:19
అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను.
27:20
అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడు నీ దేవుడైన హషేం నా యెదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పెను.
27:21
అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను.
27:22
యాకోబు తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి - స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను.
27:23
యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి
27:24
ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు - నేనే అనెను.
27:25
అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందు ననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.
27:26
తరువాత అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను.
27:27
అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన హషేం దీవించిన చేని సువాసనవలె నున్నది.