Aliyah 1 - Genesis 25:19 - 26:5
25:19
అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి యిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను.
25:20
ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.
25:21
ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై హషేంను వేడుకొనెను. హషేం అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.
25:22
ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై హషేంను అడుగ వెళ్లెను. అప్పుడు హషేం ఆమెతో నిట్లనెను
25:23
రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
25:24
ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.
25:25
మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి.
25:26
తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్ట బడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు.
25:27
ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.
25:28
ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను.
25:29
ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి
25:30
నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.
25:31
అందుకు యాకోబు - నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా
25:32
ఏశావు - నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను
25:33
యాకోబు - నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా
25:34
యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.
26:1
అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.
26:2
అక్కడ హషేం అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.
26:3
ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను;
26:4
ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.
26:5
ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.