Aliyah 4 - Genesis 24:27 - 24:52
27
అబ్రాహామను నా యాజమానుని దేవుడైన హషేం స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే హషేం నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను .
28
అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను.
29
రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను.
30
అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా
31
లాబాను హషేం వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను.
32
ఆ మనుష్యుడు ఇంటికి వచ్చి నప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితో కూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి
33
అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను.
34
అంతట అతడిట్లనెను. నేను అబ్రాహాము దాసుడను,
35
హషేం నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.
36
నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి యున్నాడు;
37
మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు.
38
అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను.
39
అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు
40
అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ హషేం నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు.
41
నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యని యెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను.
42
నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రాహామను నా యజమానుని దేవుడవైన హషేం, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన యెడల
43
నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్న దానితో నేనునీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు
44
నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి హషేం నియమించిన పిల్లయై యుండును గాకని మనవి చేసికొంటిని.
45
నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావి లోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా
46
ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను.
47
అప్పుడు నేను - నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె - మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతుల కడియములను పెట్టి
48
నా తలవంచి హషేంకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన హషేంను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను.
49
కాబట్టి నా యజమానుని యెడల మీరు దయను నమ్మకమును కనుపరచిన యెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా
50
లాబానును బెతూయేలును ఇది హషేంవలన కలిగిన కార్యము; మేమైతే అవునని గాని కాదనిగాని చెప్ప జాలము;
51
ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; హషేం సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి.
52
అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని హషేంకు సాష్టాంగ నమస్కారము చేసెను.