Aliyah 2 - Genesis 23:17 - 24:9
23:17
ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటి లోనున్న ఆ పొలము చెట్లన్నియు,
23:18
అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
23:19
ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే యెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.
23:20
ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
24:1
అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను హషేం అబ్రాహామును ఆశీర్వదించెను.
24:2
అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము;
24:3
నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక
24:4
నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన హషేం తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.
24:5
ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొనిపోవలెనా అని అడుగగా
24:6
అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ.
24:7
నా తండ్రి యింట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు హషేం తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు.
24:8
అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను.
24:9
ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను.