Logo

Aliyah 6 - Genesis 15:7 - 17:6

15:7
మరియు ఆయననీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన హషేంను నేనే అని చెప్పినప్పుడు
15:8
అతడు ప్రభువైన హషేం, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా
15:9
ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.
15:10
అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు
15:11
గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.
15:12
ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా
15:13
ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.
15:14
వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
15:15
నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.
15:16
అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
15:17
మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.
15:18
ఆ దినమందే హషేం ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా
15:19
కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను
15:20
హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను
15:21
అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
16:1
అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.
16:2
కాగా శారయి ఇదిగో నేను పిల్లలు కనకుండ హషేం చేసి యున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.
16:3
కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.
16:4
అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను.
16:5
అప్పుడు శారయినా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును హషేం న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను.
16:6
అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా
16:7
హషేం దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని
16:8
శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమాను రాలైన శారయి యొద్దనుండి పారిపోవుచున్నాననెను.
16:9
అప్పుడు హషేం దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి యుండుమని దానితో చెప్పెను.
16:10
మరియు హషేం దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.
16:11
మరియు హషేం దూత ఇదిగో హషేం నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;
16:12
అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
16:13
అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన హషేంకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.
16:14
అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్‌ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.
16:15
తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను.
16:16
హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.
17:1
అబ్రాము తొంబదితొమ్మిది యేండ్ల వాడైనప్పుడు హషేం అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
17:2
నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను.
17:3
అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను;
17:4
నీవు అనేక జనములకు తండ్రివగుదువు.
17:5
మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.
17:6
నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు.