Logo

Aliyah 7 - Genesis 5:25 - 6:8

5:25
మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.
5:26
మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
5:27
మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
5:28
లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని
5:29
భూమిని హషేం శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను.
5:30
లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
5:31
లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
5:32
నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
6:1
నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు
6:2
దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.
6:3
అప్పుడు హషేం నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.
6:4
ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.
6:5
నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు హషేం చూచి
6:6
తాను భూమిమీద నరులను చేసినందుకు హషేం సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.
6:7
అప్పుడు హషేం నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను
6:8
అయితే నోవహు హషేం దృష్టియందు కృప పొందినవాడాయెను.