సామెతలు 27
1
రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
2
నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును.
3
రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.
4
క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?
5
లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు
6
మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.
7
కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కి వేయును. ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తియ్యగా నుండును.
8
తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.
9
తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.
10
నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి,
11
నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.
12
బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
13
ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చు కొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము.
14
వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచ బడును.
15
ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము
16
దానిని ఆపజూచువాడు గాలిని అపజూచువాని తోను తన కుడిచేత నూనె పట్టుకొనువానితోను సమానుడు.
17
ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.
18
అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును.
19
నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును.
20
పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానే రదు ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు.
21
మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును.
22
మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.
23
నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.
24
ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?
25
ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడు చున్నది కొండగడ్డి యేరబడియున్నది
26
నీ వస్త్రములకొరకు గొఱ్ఱెపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును
27
నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును.