Logo

కీర్తనలు 76

1
ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. ఆసాపు కీర్తన. గీతము. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.
2
షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.
3
అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను. (సెలా. )
4
దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు.
5
కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.
6
యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.
7
నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?
8
నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి
9
దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. (సెలా. )
10
నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
11
మీ దేవుడైన హషేంకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.
12
అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.