కీర్తనలు 47
1
ప్రధానగాయకునికి. కోరాహు కుమారులు చేసినది. గీతము. సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.
2
హషేం మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.
3
ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును.
4
తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పద ముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు.
5
దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో హషేం ఆరోహణమాయెను.
6
దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.
7
దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.
8
దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధసింహాసనముమీద ఆసీనుడై యున్నాడు.
9
జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయెను.