Logo

కీర్తనలు 26

1
దావీదు కీర్తన. హషేం, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ హషేంయందు నేను నమ్మిక యుంచియున్నాను.
2
హషేం, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము.
3
నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను
4
పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందుచేయను.
5
దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను
6
నిర్దోషినని నా చేతులు కడుగుకొందును హషేం, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును.
7
అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్యకార్యములను వివరింతును.
8
హషేం, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను.
9
పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.
10
వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.
11
నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము.
12
సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో హషేంను స్తుతించెదను.