కీర్తనలు 20
1
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. ఆపత్కాలమందు హషేం నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.
2
పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాక సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.
3
ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాకనీ దహనబలులను అంగీకరించును గాక.
4
నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
5
హషేం నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాముమా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నియు హషేం సఫలపరచునుగాక.
6
హషేం తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపునుతన పరిశుద్ధాకాశములో నుండి అతని కుత్తరమిచ్చును.
7
కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన హషేం నామమునుబట్టి అతిశయపడుదము.
8
వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.
9
హషేం, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక.