ఆదికాండము 37
1
యాకోబు తన తండ్రి పరదేశ వాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.▸ అలియా 1
2
యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.
3
మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.
4
అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.
5
యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపట్టిరి.
6
అతడు వారినిచూచి - నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి.
7
అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.
8
అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగ పట్టిరి.
9
అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను.
10
అతడు తన తండ్రితోను తన సహోదరుల తోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను.
11
అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.
12
అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి.▸ అలియా 2
13
అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి - నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు - మంచిదని అతనితో చెప్పెను.
14
అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతినితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను.
15
అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి - నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను.
16
అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను.
17
అందుకు ఆ మనుష్యుడు - ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను.
18
అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.
19
వారు - ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు;
20
వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.
21
రూబేను ఆ మాట వినిమనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను.
22
ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింప దలచిరక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను.
23
యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని యుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి,▸ అలియా 3
24
అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు.
25
వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.
26
అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము?
27
ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.
28
మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.
29
రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని
30
తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి - చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్కడికి పోదుననగా
31
వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి
32
ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి - ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి
33
అతడు దానిని గురుతుపట్టి ఈ అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.
34
యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా
35
అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లకనేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.
36
మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి.