Logo

ఆదికాండము 34

1
లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను.▸ అలియా 5
2
ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.
3
అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి
4
ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను.
5
తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువు లతో పొలములలో నుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను.
6
షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను.
7
యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపమువచ్చెను.
8
అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి.
9
మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి.
10
ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.
11
మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చెదను.
12
ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.
13
అయితే తమ సహోదరియైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రియైన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా
14
మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించు కొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును.
15
మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె నుండిన యెడల సరి;
16
ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని, మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము.
17
మీరు మా మాట విని సున్నతి పొందని యెడల మా పిల్లను తీసికొని పోవుదుమని చెప్పగా
18
వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను.
19
ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు
20
హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరిగవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు
21
ఈ మనుష్యులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి; ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నదిగదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము.
22
అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేక జనముగా నుందురు.
23
వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నియు మనవగునుగదా; ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా
24
హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్లువారందరు వినిరి. అప్పుడతని ఊరి గవిని ద్వారా వెళ్లు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను.
25
మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీద పడి ప్రతి పురుషుని చంపిరి.
26
వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి
27
తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని
28
వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి
29
వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి.
30
అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు ;నేనును నాయింటివారును నాశనమగుదుమని చెప్పెను
31
అందుకు వారు - వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.